అవును అంబేద్కర్ ను స్మరిస్తాం

 అవును అంబేద్కర్ ను స్మరిస్తాం..

        ... బరాబర్ రాజ్యాంగంనూ స్మరిస్తాం 

-----------------------------------------------



కులంను యింకా సమాజంలో 

పోగొట్టలేనప్పుడు...

ఆ కంపునింకా సమాజంలో 

నింపుతున్నప్పుడు...

ఊరవతల వ్యధలని 

మార్చలేనప్పుడు...

అగ్ర కులమన్న అహంకారం 

యింకా కుళ్ళుతున్నప్పుడు...

నెమ్మదిగా మనువాదం 

చాప కింద నీరులా ప్రవహిస్తున్నప్పుడు...

మనుషుల మధ్య అసమానతలు 

మరింత ముదురుతున్నప్పుడు...

జ్ఞానం చోటున అజ్ఞానం 

జనాల్ని దహిస్తున్నప్పుడు...

నీళ్లు తాగాలన్నా 

గుడి మెట్లు ఎక్కాలన్నా 

గర్భ గుడిలోకి రావాలన్నా 

దేవుని ప్రతిమలు పెట్టాలన్నా 

మమ్మల్ని కొడుతున్నప్పుడు 

వెలివేస్తూ - తిడుతున్నప్పుడు 

పైన మూత్రం పోస్తున్నప్పుడు 

చట్టాన్ని చేతులోకి తీసుకుని 

కనికరం లేకుండా చంపుతున్నప్పుడు 

మాకొద్దు యే స్వర్గం - మాకొద్దు యే పుణ్యం 

అందుకే స్మరిస్తాం రాజ్యాంగాన్ని 

అవును ఎవరేమనుకున్నా 

స్మరిస్తాం రాజ్యాంగ నిర్మాతను..

భారత రాజ్యాంగమే -

మా హక్కులకు - భాద్యతలకు - ప్రాణాలకు 

కాస్త కూడు - గూడుకు ప్రాణాదారం...

మమ్మల్ని మనుషులుగా చూడగలిగే 

రాజ్యాంగాన్ని మాకోసం అమలుచేయగలిగే 

వారోచ్చేదాకా - వచ్చాక కూడా 

బరాబర్ బాబాసాహెబ్ ను స్మరిస్తాం..

అవును మన రాజ్యాంగాన్ని కూడా స్మరిస్తాం..


జై భీమ్...

Post a Comment

0 Comments